నగరాభివృద్దే ప్రధాన అజెండా...వాడివేడిగా నగరపాలక సర్వసభ సమావేశం...
రూ.9.22కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
సమస్యల పరిష్కారం కోసం సభ్యుల పట్టు
మూడు కూడళ్ళకు,రెండు ప్రాంతాలకు కొత్త పేర్లు
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరాభివృద్ధే ప్రధాన అజెండగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరిగింది.శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశానికి మేయర్ బి.వై.రామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఎంపీ బస్తిపాటి నాగరాజు,ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి,కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు హాజరయ్యారు.ముందుగా జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరుల దాడిలో మృతి చెందిన 28 మందికి,ఇటివల మృతి చెందిన 38వ వార్డు కార్పొరేటర్ గిప్సన్ ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు సభ సభ్యులంతా మౌనం పాటించారు.అనంతరం సర్వసభ్య సమావేశానికి తొలిసారి వచ్చిన ఎం.పీ.బస్తిపాటి నాగరాజుకి వేదికపై సత్కరించారు.అనంతరం మొత్తం 26తీర్మానాలపై పాలకవర్గ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. రూ.9.22కోట్లతో రహదారులు,మురుగు కాలువలు,ఇతరత్రా అభివృద్ధి పచ్చజెండా ఊపారు.సమావేశం ప్రారంభించిన కాసేపటికి కాస్త గందరగోళం ఏర్పడడంతో మేయర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్పందించే విధానంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో తాగునీటి సమస్య, విద్యుత్ దీపాలు,మరుగుదొడ్ల మరమ్మత్తులు,విద్యుత్ శాఖ కొమ్మలను నరికేసి అలాగే వదిలేయడం వంటి సమస్యలపై వాడివేడిగా చర్చ సాగింది. అలాగే కార్పొరేటర్లు వారి వార్డుల్లోని సమస్యలను లేవనెత్తారు.వాటి పరిష్కారం కోసం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను మినిట్స్ పెట్టి వాటి పురోగతి స్థితిగతులను ఆయా సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. నగర పరిధిలో ఎక్కడికైనా నిమిషాల వ్యవధిలో వెళ్ళవచ్చని,అధికారులు సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో వెళ్లాలని,అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.తాగునీటి సమస్య పరిష్కారానికి రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రతిపాదనను రూపొందించాలని ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పథకాల ద్వారా నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటే,అధికారులు తన దృష్టికి తీసుకుని రావాలన్నారు.ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ...కల్లూరు 16 వార్డుల్లో తాగునీటి సమస్య చాలా ఉందని,మెరుగుపరిచేందుకు అధికారులు వీలైనంత మేర చర్యలు తీసుకోవాలన్నారు.గోరుకల్లు నుండి కర్నూలుకు తాగునీరును తీసుకొచ్చి ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని,అందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు తయారు చేయాలన్నారు. వీధిదీపాలు,మరుగుదొడ్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలని,రహదారులు, మురుగు కాలువల నిర్మాణంలో జాప్యం చేయొద్దని సూచించారు.హంద్రీ నదిపై పార్కులు,రహదారుల నిర్మాణం చేసేటప్పుడు న్యాయపరమైన చిక్కులు లేకుండా అనుమతులు తీసుకోవాలన్నారు.కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని అధికారులకు సూచించారు.పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని,పుష్‌కార్టులు లేక సంచుల్లో చేత సేకరించడం బాధాకరమన్నారు.పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు.కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ...నగరపాలక సంస్థ పరిధిలోని కోడుమూరు మూడు వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, మామిదాలపాడులో రహదారులు, మురుగు కాలువలు నిర్మాణం చేపట్టాలన్నారు.కేసి కెనాల్‌లో మురుగునీరు ఎక్కువైందని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.బంజార కాలనీ ప్రభుత్వ స్థలంలో స్కూల్ నిర్మించాలన్నారు.ఎల్.పేట,మాస మసీద్, స్టాంటన్‌పురం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,మేనేజర్ చిన్నరాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,ఎస్.ఈ.రాజశేఖర్,సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్,ఆర్ఓలు జునైద్, ఇశ్రాయేల్,టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు,ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
1. తాగునీటికి సంబంధించి 88.234 ఎంఎల్‌డిల నీటిని క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఫెర్రిక్ ఆలం సరఫరా, ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్ వంటివి చేయుటకు రూ.1.30 కోట్లు కేటాయింపు.
2. వీధి దీపాల నిర్వహణ కోసం 21 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుటకు రూ.57 లక్షలు కేటాయింపు.
3. 17వ వార్డు మారెమ్మ దేవాలయం వద్ద రూ.40లక్షలతో మురుగు కాలువ సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమోదం.
4. 19వ వార్డు సోమిశెట్టి నగర్ సరస్వతి నగర్, నాజర్ కాలనీ,లక్ష్మీ టౌన్‌షిప్, వెంకటాద్రి కాలనీ,మణికంఠ హోమ్స్, బృందావన్ కాలనీ,మారుతి నగర్, జ్యుడీషియల్ కాలనీ,ఎల్కుర్ ఎస్టేట్ ప్రాంతాల్లో మేజర్ డిస్పోజల్ డ్రైన్ నిర్మించుటకు రూ.1.31కోట్లు కేటాయింపు.
5. 45వ వార్డులో మురుగు కాలువల వెడల్పునకు రూ.16లక్షలు కేటాయింపు.
6. 45వ వార్డు శ్రీనగర్ కాలనీ నందు మురుగు కాలువల నిర్మాణానికి రూ.49 లక్షలు మంజూరు.
7. 25వ వార్డు సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి దేవనగర్ రైల్వే గేటు వరకు ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉంది.సిసి రహదారి నిర్మించుటకు రూ.80 లక్షలు మంజూరుకు ఆమోదం.
8. 29వ వార్డు నందు వివిధ కాలనీలో మేజర్ డిస్పోజబుల్ ట్రైన్ నిర్మించుటకు రూ.1.52కోట్లు కేటాయింపు.
9. 35వ వార్డు భగవాన్ నగర్ గని గుంతల ప్రాంతంలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు.
10. 39వ వార్డు బంజారా కాలనీ (చింత చెట్టు మసీదు వెనుక) నందు మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు.
11. 40వ వార్డు నందు కేశవరెడ్డి స్కూల్ వెనుక మురుగు కాలువల నిర్మాణానికి రూ.49 లక్షలు కేటాయింపు.
12. 41వ వార్డు నందు మురుగు కాలువల నిర్మాణానికి రూ.15లక్షలు కేటాయింపు.
13. బెకారి కట్ట,గరీబ్‌నగర్ ప్రాంతాల పేర్లు న్యూనత భావం స్పూర్తిస్తున్నందువలన బేకారికట్ట ప్రాంతాన్ని జనం అబ్దుల్ సలాం ఖాన్ సాహెబ్ నగర్‌గా,కరీంనగర్ ప్రాంతాన్ని డాక్టర్ కే.ఎం.ఇస్మాయిల్ హుస్సేన్ నగర్‌గా పేర్లు మారుస్తూ తీర్మానించారు.
14.120మైక్రోన్ల మందం కంటే తక్కువ గల ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు,బాటిల్స్, బెలూన్స్ స్టిక్స్,క్యాండీ స్టిక్స్ వంటి వస్తువులను నిషేధించి,పట్టుపడితే వీధి వ్యాపారులకు మొదటిసారి రూ.2500, రెండోసారి 5,000,సంస్థలు,వాణిజ్య సముదాయాలు అయితే మొదటిసారి రూ.20,000/- రెండోసారి రూ.40,000 వేల జరిమానాతో పాటు ప్లాస్టిక్ వస్తువుల స్వాధీనం,రద్దు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
15.15వ వార్డు బుధవారపేట నందు మోడరన్ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించుటకు రూ.50 లక్షలు కేటాయించారు.
16. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు కల్లూరు మండలం సర్వేనెంబర్ 680, ఎల్ పి నెంబర్ 531/82 నందు 1.41సెంట్ల భూమిని వినోదబరితమైన స్థలము నుండి నివాసయోగ్యమైన స్థలముగా మార్చుటకు తదుపరి చర్యల కోసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేక పంపుటకు తీర్మానించారు.
17. శ్రీరామ టాకీస్ వద్దనున్న సర్కిల్ పేరును శ్రీ బసవ సర్కిల్‌గా నామకరణం చేయుటకు తీర్మానించారు.
18. బుధవార పేట మెడికల్ కాలేజీ సమీపంలో మలుపును 120 అడుగులుగా విస్తరించినందుకు, షాపులు కోల్పోయే బాధితులకు ప్రత్యామ్నాయంగా,వెంకటరమణ కాలనీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు నామమాత్రపు అద్దెపై ఏడు షాపులు కేటాయించేందుకు పచ్చజెండా ఊపారు.
19. 20,21వ వార్డుల నందు శ్రీలక్ష్మి నగర్ నందు సిసి డ్రెయిన్,కల్వర్టు నిర్మాణానికి రూ.32.00లక్షలు కేటాయింపు.
20. ఔట్ సోర్సింగ్ వర్కర్‌గా పని చేస్తూ చనిపోయిన జి.భవాని,అలాగే అనారోగ్య కారణాలతో పనిచేయలేకున్న మైతపు లక్ష్మీదేవి, సి.విజయలక్ష్మిల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించుటకు ఆమోదించారు.
21. 46వ వార్డు నరసింహ రెడ్డి నగర్ నందు రైల్వే అండ గ్రౌండ్ బ్రిడ్జి నుండి మన్నా చర్చి వరకు రహదారి తక్కువ, ఎక్కువలను సరి చేయడానికి రూ.25.50 లక్షలు మంజూరు.
22. ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచనల మేరకు ఆనంద్ టాకీస్ దగ్గర కిసాన్ ఘాట్ నకు పోవు రోడ్డు సర్కిల్ నకు శ్రీ కనకదాసు సర్కిల్ గా నామకరణం చేశారు.
23. కర్నూలు మారట సేవ సంఘం విజ్ఞప్తి మేరకు ఆదోని - ఉల్చాల వై.జక్షన్ కూడలికి శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్కిల్‌గా నామకరణం చేశారు.
24. 8వ వార్డు పెద్దపడకాన నందు కమ్యూనిటి హాల్ నిర్మాణమునకు రూ.70.00 లక్షలు కేటాయింపు.
25. లక్ష్మీపురం గ్రామా సర్వే నెం.143(P), 118A(P), 118/C(P) మరియు 116/A(P) నందు మాస్టర్ ప్లానులో ప్రతిపాదించిన 100 అడుగుల వెడల్పు రోడ్డును రద్దు పరచి ప్రత్యామ్నాయంగా లక్ష్మి పురం సర్వే నెం.117A నుండి 126 నందు 100 అడుగుల వెడల్పుగా గల రోడ్డును 200 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డునకు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినందుకు ఆమోదం తెలిపారు.
Comments
Post a Comment