యూట్యూబ్ లో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసిన నిందితులు...

కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు...

27తులాల బంగారం ఆభరణాలు,35 తులాల వెండి ఆభరణాలు నిందితుల నుండి స్వాధీనం...

దొంగతనంకు వినియోగించిన రంపం, ఇనుప రాడ్డు,రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం...

ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలి

ఎల్ హెచ్ ఎం ఎస్ యాప్ వినియోగించుకోవాలి 

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
 
కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయివైభవ్ నగర్ లో నివశిస్తున్న ఆర్టిసి డిపో - 1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఈ నెల 13వ తేదిన కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకొని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఆర్టీసి డిపో -1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదారాబాద్ కు ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్ళిన సంధర్బం చూసుకొని షేక్షావలి (స్పైస్ డాభాలో పని చేసే యువకుడు),తనతో పాటు చట్టంతో విభేదింఛిన ఐదు మంది బాలురను జత చేసుకుని ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి తాళంను విరగగొట్టుటకు వీలుగా ఒక నూనెను,ఒక రంపంను,ఇనుపరాడ్డును సిధ్ధం చేసుకుని రెండు మోటారు సైకిళ్ళ మీద సాయి వైభవ్ నగర్ కు రాత్రి 1-00 గంటకు చేరుకున్నారు.చుట్టు ప్రక్కల ఎవరు గమనించడం లేదని తెలుసుకుని ప్రధాన ద్వారంలోని తాళంలో నూనె పోసి మరి శబ్ధం రాకుండా విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. రూ.20లక్షల విలువైన సుమారు 27తులాల బంగారం ఆభరణాలు,35తులాల వెండి ఆభరణాలు దొంగలించి మోటార్ సైకిళ్ళ పై పారిపోయి,దొంగలించిన సోత్తులను భాగాలు వేసుకుని పంచుకున్నారు. మరుసటి దినం దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ ఈ నెల 13వ తేదిన చేసిన ఫిర్యాదు మేరకు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.సాంకేతిక ఉపకరణాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని,కేసు చేధన కోసం పోలీసు బృందాలు ఏర్పడి,కేసును త్వరితగతిన నేర పరిశోధన చేపట్టారు. కేసు చేదనలో భాగంగా కర్నూలుకు చెందిన షేక్షావళి,అతనితో పాటు ఐదుగురు బాలురను ఈ నెల 25వ తేదీన నంద్యాల చెక్ పోస్ట్,కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని,వారిని సోదా చేయగా వారి వద్ద నుండి దొంగతనం చేసిన సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి దొంగతనానికి వాడిన రంపం, రాడ్డు,రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో వారి గురించి పరిశీలించగా ఇద్దరు బాలురు ఇంతకు ముందే రెండు దొంగతనాలలో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది.విచారణలో బాలురు అందరూ పాఠశాలలకు వెళ్ళకుండా డ్రాప్ అవుట్ అయి మెకానిక్ షెడ్లలలోనూ అల్లరి,చిల్లరగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడినట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.అదుపులోకి తీసుకున్న వారిని సంబంధిత న్యాయస్ధానాల ముందు హజరు పెట్టడం జరుగుతుంది.రికవరీ చేసిన సొమ్మును డిపో మేనేజర్ కి అందజేయడం జరుగుతుందని పోలీసులు తెలియచేశారు.ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి,బాగా ప్రతిభ కనబరిచిన కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,కర్నూలు మూడవ పట్టణ సి.ఐ.శేషయ్య,కర్నూలు ఒన్ టౌన్ అడిషనల్ సి.ఐ.నాగశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు చెంచన్న,సుంకన్న, రంగారావు,కానిస్టేబుళ్లు నాగరాజు, కిశోర్,నాగేశ్వరరావు,చంద్రబాబు నాయుడు,నాగరాజు,తిరుమలేష్, పరశురాముడు,వీరబాబులకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రివార్డులు అందజేశారు.
జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి :

ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలన్నారు. 

ఎల్ హెచ్ ఎం ఎస్ యాప్ వినియోగించాలన్నారు. 

ఇళ్ళ చుట్టూ ముందు రోడ్డు బాగా కనపడేవిధంగా సిసి కెమెరాలు అమర్చుకునేవిధంగా చేయాలన్నారు. 

కాలనీలలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments